సంగీతమందు గల భిన్న సంప్రదాయములు
భారతీయ సంగీతము అనేక సంప్రదాయ రీతులలో భాసిల్లుచున్నది. వాటిలో ముఖ్యమైనవిగా కర్ణాటక, హిందుస్థానీ సంగీత సంప్రదాయములు చెప్పబడుచున్ననూ, ప్రసిద్ధములైన యితర సంప్రదాయములూ కలవు. వాటిని గురించి ఈ దిగువన ప్రస్తావించెదము.
కర్ణాటక సంగీతము
చెవుల కింపైన దేదైనా కర్ణాటక సంగీతమే. కాని దక్షిణాదిలో ప్రాచుర్యం పొందిన సంగీత బాణీని కర్ణాటక సంగీతమనీ, దాక్షిణాత్య సంగీతమని అంటారు. ఇందులో శాస్త్రీయ సంగీతం పండితరంజకంగా ఉంటే, ఇతర రకారలైన సంగీత రూపాలు దెశకాలపరిస్తితుల కనుగుణంగా, పామర రంజకంగా అభివృద్ధి చెందాయి.
హిందూస్థానీ సంగీతము
సామవేద జనితమైన సంగీతం ఉత్తరాదిన మొగలుల ప్రభావంతో మార్పులు చెంది నేడు ప్రచారంలో ఉన్న హిందూస్తానీ సంగీతంగా ప్రచారంలో ఉంది. ఇది ముఖ్యంగా రాజాస్థానాల్లో పాడబడేది. దీనిలో అనేక బాణీలు జనించాయి.
భక్తి సంగీతము
ఈ సంగీత సంప్రదాయము భక్తి రస ప్రధానము. ఈ సంప్రదాయము ఆయా వాగ్గేయకారుల పద్యములు, భజనలు, సంస్కృత శ్లోకములను కలిగి వుండును. సాధారణముగా శ్లోకముల వంటివాటికి తాళము చెప్పబడదు.
కాలక్షేపము
ఇది పురాణేతిహాసములలోని ప్రధాన ఇతివృత్తములను ఆధారముగా చేసికొని సాగే సంగీత కథనము. దక్షిణ భారతదేశమందు ప్రసిద్ది చెందిన ఈ ప్రక్రియయందు ప్రథాన గాయకుడు కథాభాగమునకు శ్లోకములు, కీర్తనలు మేళవించి రసరమ్యముగా ఆలపించును.
నాట్యమునందు సంగీతము
దక్షిణ భారతదేశమందు ఖ్యాతినొందిన శాస్త్రీయ నృత్యములగు భరత నాట్యము, కూచిపూడి, మొదలగునవి కర్ణాటక సంగీతముపై మిక్కిలి ఆధారపడియున్నవి. తిల్లానా, పదము, జావళి, మొదలగునవి సంగీత కచేరీలయందును, నృత్య ప్రదర్శనలయందును ముఖ్య భాగములుగా పరిగణింపబడుచున్నవి. నృత్యమున ఉపయుక్తములగు కృతులు నృత్తమునకు, అభినయమునకు అనుగుణముగా మార్పు చేయబడును అనగా, కాల భేదము చూపబడును.
జానపద సంగీతము
భారతదేశము జానపద సంగీతానికి పట్టుకొమ్మ. కొన్ని జానపద గేయాలు శతాబ్దాలనుండీ తరువాతి తరముల వారికి అందింపబడుతున్నాయి. ఇక పోతే, చక్కటి గతులతో హృదయాన్ని హత్తుకునేలా ఉండటం దీని ప్రత్యేకత. ఇప్పటికీ పల్లెటూర్లలో జానపదాలు వినవస్తాయి. శాస్త్రీయ సంగీతం లోని ఆనంద భైరవి వంటి రాగాలు కొన్ని జానపద సంగీతం నుండి వచ్చినవే. చాలా మటుకు సినిమా సంగీతం కూడా జానపదాల మీద ఆధారపడి వుంది.)
