వెంకటగిరి చేనేత కళాకారుడు గౌరబత్తిన రమణయ్య మరోసారి జాతీయ అవార్డుకు ఎంపికయ్యాడు. జంధాని చీరపై కల్పవృక్షం చిత్రాన్ని రెండువైపులా కనిపించేలా కళానైపుణ్యాన్ని ప్రదర్శించడంతో ఈ అవార్డుకు ఎంపికయ్యాడు. గురువారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా సంపత్‌కభీర్ జాతీయ అవార్డును అందుకోనున్నారు. ఈ విషయంపై 'ఆన్‌లైన్' సేకరించిన వివారాలిలా ఉన్నాయి. ఈ అవార్డుకు దేశం మొత్తం మీద 10మంది చేనేత కళాకారులు ఎంపిక కాగా.. మన రాష్ట్రం నుంచి రమణయ్య ఎంపికయ్యాడు. 55 సంవత్సరాల నిండి ఓ సారి జాతీయ అవార్డు అందుకున్న కళాకారులకే ఈ అవార్డు అందుకునేందుకు అర్హత కలిగినట్టు కళాకారుడు రమణయ్య ఆన్‌లైన్‌కు వివరించారు.
అవార్డుల పంట
రమణయ్య 2005లో జంధాని చీర డిజైనర్‌గా అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం చేతులమీదుగా జాతీయ అవార్డును అందుకున్నారు. 2006లో లైఫ్ ఆఫ్ ట్రీ వాల్‌హ్యాంగ్ డిజైన్‌కు లేపాక్షి రాష్ట్ర అవార్డును అందుకున్నారు. అదే సంవత్సరంలో యున్స్‌కో అంతర్జాతీయ సంస్థవారు ఆయన కళానైపుణ్యాన్ని మెచ్చి సర్టిఫికెట్‌ను అందజేసి గౌరవించారు. వాల్‌హ్యాండిల్ పై మామిడి పిందె చిత్రాన్ని నేసి క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారిచే కమలారెడ్డి అవార్డును అందుకున్నారు. రమణయ్య బాల్యం నుంచే చేనేత వృత్తిలో రాణిస్తూ విదేశాలకు ఎగుమతి అయ్యేలా అధునాతన డిజైన్‌లతో చీరలు నేస్తూ అందరి మన్ననలు పొందారు. వెంకటగిరి చేనేతకు ప్రపంచ కీర్తి సాధించి పెట్టారు.
