కళాకారులకు మార్గదర్శకులు :- శ్రీ హెచ్ శ్రీనివాసరావు గారు, ఎందరో ఈనాటి కళాకారులకు స్పూర్తిగా, మార్గనిర్దేశకులుగా ఉన్న
శ్రీ హెచ్ శ్రీనివాసరావు గారు సంగీతంలో గొప్ప కళకారుడు, ఈ కళ వెనుక వెంకటగిరి రాజా సంస్థాన విద్వాంసులైన గవ్వాయి గోవిందరాజులనాయుడు గారు దగ్గర 1940 కాలంలో ఆయన దగ్గర శిష్యరికం చేసి సితార, బ్యాంజో, బుల్ బుల్ , దిల్ రుబా, జలతరంగణి మరియు హార్మోనియం పై మంచి ప్రావీణ్యమును సంపాదించినారు.
ఈయన మనసు కవి ఆచార్య ఆత్రేయ అత్యంత ఆత్మీయులు, మంచి స్నేహితులు, వీరిద్దరు కలసి అపోహ, ఈనాడు, పరివర్తన తదితర నాటకాలలో నటించారు, మేకప్ చేయడంలో బహు నిష్ణాతులు, 1950 కాలంలో కల్చర్ ఆర్ట్ థియేటర్ పేరున వెంకటగిరిలో ఒక నాటక సంస్థను స్థాపించి ఎన్నో గొప్ప నాటకాలు జరిపించి అందులో నటించి, దర్శకత్వం వహించి, సంగీత దర్శకత్వం కూడా వహించిన బహుముఖ మేధావి, ఇతర ప్రాంతాలలో జరిగే నాటక పోటీలలో ఎన్నో సార్లు వెంకటగిరి కల్చర్ ఆర్ట్స్ కు ప్రధమ బహుమతులు అందించి ఘనత సాధించారు.
నేటి విశ్వోదయ ప్రభుత్వ కళాశాల ఏర్పాటుకు అలనాడు శ్రీ జె.వి. నరసింహారావు గారు, మాకాని వెంకటస్వామి గార్లతో పాటు శ్రీ హెచ్. శీనివాసరావు ఎంతగానో కృషి చేశారు, ఇప్పటికి క్రమశిక్షణయుతమైన జీవితముతో 85సం.లు వయస్సులో కూడా కళా బీష్మునిగా కళాకారులకు అమూల్యమైన సలహాలిస్తూ వుంటారు.
అంతేగాక శ్రీ సాయి కృష్ణయాచేంద్ర వారికి ‘‘ సంగీత గేయధారకు ’’ ఎంతో సహకారము అందించినారు.
